DNS - ముక్కు దూలం వంకర
పరిచయం:
ముక్కు అనేది మన శరీరం లో అతి సున్నితమైన భాగాలలో ఒకటి. గాలి పీల్చుకోడం వాసనను గుర్తించడం లాంటి ఎన్నో పనులు చేస్తుంది. చలికాలంలో మనం ముక్కుకు సంభందించిన వ్యాదుల బారిన పడుతూ ఉంటాము అది సహజం కానీ మామూలు రోజులలో కూడా మనకి ఇబ్బంది కలుగుతున్నట్లైతే మన ముక్కులో సమస్య ఉన్నట్టు.
మన జనాభాలో దాదాపుగా 70- 80% మంది DNS లేదా ముక్కు దూలం వంకర సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అని ఒక సామాజిక సర్వే లో తేలింది. ఇది తీవ్రమైన సమస్య కానప్పటికీ దీనికై నివారణ చర్యలు చేపట్టకపోతే ముక్కుకి మరియు చెవి కి సంభందించిన ఇబ్బందులకి దారి తీస్తుంది.
DNS – ముక్కు దూలం వంకరగా ఉండటం గురించి తెలుసుకునే ముందు మన ముక్కు లోపలి నిర్మాణం గురించి తెలుసుకుందాం.

Image courtesy – Wikimedia
నాసికా సెప్టం యొక్క నిర్మాణము:
మన ముక్కు బాహ్యంగా ఏకంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా ఎడమ ముక్కు నుండి కుడి ముక్కును వేరు చేస్తూ మధ్యలో ఉండే దూలాన్ని నాసల్ సెప్టం(Nasal Septum) అంటారు. ఈ సెప్టం ముందు భాగంలో కార్టిలేజ్(Cartilage) మరియు వెనుక భాగంలో ఎముకను(Bone) కలిగి ఉంటుంది. సెప్టమ్‌లో ఏదైనా తేడా లేదా వంకరగా ఉన్నప్పుడు, దానిని డీవీయేటెడ్ నాసల్ సెప్టం / Deviated Nasal Septum (DNS)అని అంటారు వాడుక బాషలో ముక్కు దూలం వంకర అని కూడా అంటారు.
ముక్కు దూలం వంకర ఎక్కడ ఏర్పడుతుంది?
ముక్కు దూలం వంకర అనేది ముక్కు ముందు(Floor) భాగంలో ఉన్న కార్టిలేజ్ వద్ద కానీ, ముక్కు వెనుక భాగం లో ఉన్న ఎముక వద్ద లేదా, కార్టిలేజ్ మరియు ఎముక కలిసే చోట అయిన మధ్య భాగంలో కానీ విచలనం / డీవియేషన్(Deviation) ఉండొచ్చు. డీవియేషన్ అనేది C లేదా S ఆకారాన్ని పోలి ఉంటుంది, కొన్ని సార్లు తిరగేసిన C లేదా S ఆకారంలో కూడా ఉండొచ్చు.
అసలు ముక్కు దూలం ఎందుకు వంకర అవుతుంది?
ముక్కు దూలం వంకర అవడానికి చాలా కారణాలు ఉన్నాయి
- ముక్కు దూలం వంకర పుట్టుకతో రావచ్చు దానినే బర్త్ మోల్డింగ్ థియరి(birth molding theory) అంటారు. బిడ్డ తల్లి గర్భాశయంలో ముడుచుకుని ఉన్నప్పుడు కొన్నిసార్లు చెయ్యి లేదా కాలు ముక్కుకి ఆనుకుని ముక్కు మీద ఒత్తిడి కలిగించినపుడు,లేదా ముక్కు ఎక్కువ కాలం గర్భాశయానికి ఆనుకుని ముక్కు మీద ఒత్తిడి కలిగినపుడు ముక్కు దూలం వంకరకు గురవుతుంది.
- శిశువు సహజ ప్రసవం ద్వారా తల్లి గర్భం నుండి ప్రసవించినప్పుడు, బిడ్డని బయటకి తీసే సమయంలో ఒక్కోసారి ముక్కుమీద తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది అటువంటి సమయంలో కూడా ముక్కు దూలం వంకర అయ్యే అవకాశం ఉంది. ప్రసవం సమయంలో ఉపయోగించే Forceps లాంటి పనిముట్లు ముక్కు మీద ఒత్తిడి కలిగించినపుడు కూడా మక్కు దూలం వంకర అయ్యే అవకాశం ఉంది. లేత వయస్సులో ఏ చిన్న ఒత్తిడి ముక్కు మీద పడిన దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
- బాక్సింగ్, క్రికెట్ వంటి క్రీడలు ఆడినపుడు ముక్కుకి దెబ్బలు తగిలి కొన్ని సందర్భలలో DNSకు దారితీస్తాయి. రోడ్డు ప్రమాదాలలో ముక్కుకి గాయం అయినప్పుడు మీ ముక్కు ఎముకకు దెబ్బతగిలి ఎముక వంకర అయ్యే అవకాశం ఉంది.
- ముఖం(face) అనేది శరీరంతో పాటు ఎదుగుతూ ఉంటుంది, కొన్ని సార్లు అంగిలి మరియు మన ముక్కు ఎదుగుదలతో పాటు సమతుల్యంగా లేనప్పుడు ముక్కు దూలం లో తేడా వస్తుంది.
ముక్కు దూలం వంకర (DNS) యొక్క లక్షణాలు ఏమిటి?
ముక్కు దూలం వంకరగా ఉన్న వారిలో మనం ఈ క్రింది లక్షణాలని గమనించవచ్చు అవి :
- తరచూ ముక్కు దిబ్బడ పోవడం: ఒక ముక్కు మూసుకునిపోయి ఉన్నప్పుడు ఇంకో ముక్కు పనిచేస్తుంది, అనగా కూడి ముక్కు మూసుకుని ఉన్నప్పుడు ఎడమ ముక్కు పనిచేయడం లేదా ఎడమ ముక్కు మూసుకుని ఉన్నప్పుడు కూడి ముక్కు పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా DNSతో బాధ పడేవాళ్ళు నిద్రలో కుడివైపు లేదా ఎడమ వైపుకి తిరిగి పడుకుంటారు, కారణం వాళ్ళకి ఆ స్థితి లో ఊపిరి పీల్చుకోవడం సులువుగా ఉంటుంది.
- శ్వాస తీసుకునేటప్పుడు ముక్కునుండి శబ్దం వస్తుంది దీనినే Noisy breathing అని అంటారు. కొన్ని సార్లు నిద్రలో బలవంతం గా గాలి పీల్చుకోవడం వలన ముక్కు నుండి విజిల్ శబ్దం వస్తుంది. ఈ శబ్దాలని వారు గమనించలేరు ఇది వారికి వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు ద్వారా తెలుస్తుంది.
- DNS తో ఇబ్బంది పడేవాళ్ళల్లో అప్పుడప్పుడూ ముక్కునుండి రక్తం కారుతుంది.
ముక్కు దూలం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి ?
- మనం ముక్కు ద్వారా శ్వాస పీల్చేటప్పుడు గాలి వంకరగా ఉన్న దూలం మీదుగా వెళ్ళి అక్కడ చర్మాన్ని పొడిబారిపోయేలా చేస్తుంది. పొడిబారిపోయిన చర్మం మీద కురుపులు వేస్తాయి అవి రాలిపోయినపుడు ముక్కునుండి రక్తం కారుతుంది.
- మొహంలో లేదా తలలో ఒక వైపు నొప్పి పెట్టడం: ముక్కు దూలం వంకర వల్ల ముక్కులోపల ఉండే టర్బినేట్ల పై ఒత్తిడి పెరుగుతుంది అప్పుడు ఒకవైపు తల లేదా మొహం నొప్పి పెడుతుంది.
- మనం ముక్కునుంచి పీల్చుకునే గాలి చెవిలోకి సైనస్ డ్రైనేజీ(Sinus drainage) ద్వారా వెళ్తుంది. ముక్కు దూలం వంకర వల్ల ఈ సైనస్ డ్రైనేజీ మూసుకునిపోయి సైనసిటిస్ కు దారి తీస్తుంది.
- మనం నోటిద్వారా గాలి పీల్చుకున్నప్పుడు ఆ గాలి నోటినుండి చెవికి యూస్టాచియన్ ట్యూబ్ ద్వారా వెళ్తుంది. ఈ ట్యూబ్లు చెవికి వెంటిలేషన్ అందిస్తాయి. DNS ఉన్న వారిలో ఈ ట్యూబ్లు మూసుకునిపోయి చెవిలో చీము లేదా ద్రవం, చెవి పోటు, చెవిలో రంధ్రాలు ఏర్పడే అవకాశం ఉంది.
వంకర ముక్కు దూలాన్ని ఎలా గుర్తిస్తారు?

సాధారణంగా ENTనిపుణులు వారి దగ్గర ఉండే హెడ్ లైట్(head light) ముక్కులోకి వేసి ముక్కు ముందు భాగం లో ఏదైనా తేడా/ DNS ఉందా లేదా అని గుర్తిస్తారు. ముక్కు లోపల భాగంలో వంకరని కనిపెట్టడానికి DNE అనగా డయాగ్నోస్టిక్ నాసల్ ఎండోస్కొపీ చేస్తారు. DNSతో పాటు సైనస్ తో బాధ పడుతున్న వారికి ముక్కుకి సంబంధించి CT స్కాన్ (CT PNS)చేసి DNS ఎంతవరకూ ఉంది అని కచ్చితమైన నిర్ధారణకు వస్తారు.
డాక్టర్ చైతన్య రావు గారు ప్రత్యేకించి రైనోమానోమెట్రీ అనే పరీక్షను చేసి ముక్కు ఎంత మేర దిబ్బడి పోయిందో తెలుసుకుంటారు. ఈ పరీక్ష సెప్టోప్లాస్టీ లేదా సైనస్కు శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో చేసి ముక్కులో ఎంతమేర దిబ్బడ ఉంది అని గుర్తిస్తారు. దీనివలన బాదితులకి మెరుగైన చికిత్సని అందించడం జరుగుతుంది.
ముక్కు దూలనికి చికిత్స ఏమిటి ?
ముక్కు దూలం వంకర అనేది దాదాపుగా 70- 80% మందిలో ఉంటుంది. కొందరిలో లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి అలాంటి సందర్భంలో ముక్కు దూలం వంకర సమస్య తీవ్రతను బట్టి ENT నిపుణులు చికిత్స చేస్తారు. DNS వల్ల రోగికి పెద్దగా సమస్యలు లేనప్పుడు వాటి లక్షణాలను నివారించడానికి మందులను సూచిస్తారు.
ముక్కు దూలం యొక్క తీవ్రత ఎక్కువగా ఉండి వారికి తీవ్రమైన ఇబ్బందులు ఉంటే సెప్టోప్లాసి (Septoplasty) అనే శస్త్రచికిత్సను చేసి ముక్కు దూలాన్ని సరిచేస్తారు. ఈ శస్త్ర చికిత్సను సాధారణ మత్తు మందు ఇచ్చి చేస్తారు, కొన్ని పరిస్థితులలో ముక్కుకి మాత్రమే మత్తు ఇచ్చి శస్త్రచికిత్స ను చేస్తారు. ఈ శస్త్ర చికిత్స కి దాదాపుగా 1- 2 గంటల సమయం పడుతుంది.
ముక్కు దూలనికి చికిత్స చేయకపోతే ఏమవుతుంది?
ముక్కు దూలనికి చికిత్స చేయకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి:
- దీర్ఘ కాలం సైనస్ తో బాధ పడటం
- నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం
- ఆస్తమా(Asthma)
- నిద్ర సరిగ్గా పట్టకపోవడం
- ముక్కు నుంచి రక్తం కారడం
- నోరు పొడిబారిపోవడం
- ముక్కు తరచూ దిబ్బడ పోవడం
Frequently Asked Questions about the Deviated Nasal Septum
ముక్కు దూలం వంకర జన్యుపరంగా సంక్రమించవచ్చని సూచించే అధ్యయనాలు లేవు. కాబట్టి మీ నుంచి మీ బిడ్డకు ఇది సంభవించదు. మీరు నిశ్చింతగా ఉండొచ్చు, ఇది వంశపారం పర్యంగా వచ్చే వ్యాది కాదు.
ముక్కు దూలం వంకర సమస్యను శస్త్రచికిత్స లేకుండా సరిచేయడం కుదరదు. ఒకవేళ మీకు తేలికపాటి లక్షణాలు ఉంటే, వాటినుండి ఉపశమనం కోసం మీ ENT నిపుణులు మందులను సూచించి లక్షణాలను నయం చేస్తారు కానీ మందులతో దూలన్నీ సరిచేయలేరు.
ముక్కు దూలం పిల్లల్లో 15 సంవత్సరాలు వయస్సు వచ్చేంత వరకు పెరుగుతుంది. కాబట్టి పిల్లలకి ముక్కు దూలం వంకర ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, ముక్కు దూలం పెరుగుదల పూర్తయ్యే వరకు శస్త్రచికిత్స అవసరం లేదు. ఆ తర్వాత దని తీవ్రతను బట్టి శస్త్రచికిత్స చేస్తారు. ముక్కు దూలం వంకర పెద్దవారిలో వయస్సుతో పాటు పెరగదు కానీ కొన్ని సార్లు, ముక్కు దూలం వంకర సైనస్ సమస్యలను కలిగిస్తుంది. వారు అనుభవించే లక్షణాలు ఆ సందర్భం లో మరింత తీవ్రమవుతాయి.
లేదు, సెప్టోప్లాస్టీ శస్త్రచికిత్స కనుక సరిగ్గా చేసిన తర్వాత, మళ్ళీ ముక్కు దూలం వంకర అవ్వదు. శాస్త్ర చికిత్స తర్వాత కొంచం ఇబ్బంది ఉన్న క్రమేపి కోలుకోవడం వలన పూర్తిగా DNSను అరికట్టవచ్చు.
లేదు, ముక్కు దూలం వంకర అనేది ఒక స్థిరమైన సమస్య. ముక్కు దూలం వంకరతో బాధ పడేవారిలో కొన్నిసార్లు లక్షణాలు రాత్రి పూట తీవ్రం అవ్వొచ్చు కానీ దూలం వంకర పెరగదు. ముక్కు దూలం వంకరగా ఉన్న వాళ్ళు ఎక్కువగా వారి కుడి వైపు లేదా ఎడమ వైపు నిద్రించడానికి ఇష్టపడతారు, ఎందుకంటే వారికీ ఆ స్థితిలో ఊపిరి అంతరాయం లేకుండా పీల్చుకోగలుగుతారు.
ముక్కు దూలం వంకర అనేది ప్రాణాంతకమైన వ్యాది కాదు కానీ నయమయ్యే సమస్యలతో మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ముక్కు దూలం వంకరని సాధారణ శస్త్రచికిత్స ద్వారా దీనిని నిర్మూలించవచ్చు.
DNS శస్త్రచికిత్స తర్వాత ముక్కు చుట్టూ మరియు దంతాల ప్రాంతం చుట్టూ కొద్దిగా ఇబ్బంది ఉండవచ్చు, వాటిని అవి మందులతో నయం చేయవచ్చు. శస్త్రచికిత్స చేసిన 1-2 రోజులు కొద్దిగా ఇబ్బంది ఉన్న ఆ తర్వాత నుంచి తగిన జాగ్రత్తలతో అన్నీ లక్షణాలను నిర్మూలించవచ్చు.
శస్త్రచికిత్స అనేది ఎండోస్కోపి పద్దతిలో చేయబడుతుంది, ఇది పూర్తిగా ముక్కు లోపల నుండి చేయబడుతుంది, కాబట్టి ముఖం వెలుపల ఎటువంటి కోతలు లేదా గుర్తులు కనిపించవు. శస్త్రచికిత్సతో మీ ముక్కు ఆకారం మారదు.
హ, శస్త్రచికిత్స తర్వాత మీ శ్వాసలో క్రమ క్రమం గా మార్పు చూస్తారు. పూర్తిగా నయం కావడానికి 30 నుండి 45 రోజుల మధ్య సమయం పడుతుంది.
ముక్కు దూలం వంకరని ఇంటి వద్దే ఒక చిన్న పద్దతితో గుర్తించవచ్చు ఎలా అంటే:
మీ చూపుడు వేలితో, మీ కుడి ముక్కును మూసివేసి, ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. ఆ తర్వాత మీరు మీ ఎడమ ముక్కును మూసివేసి, కుడి ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకోండి. మీకు ఒక వైపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే కనుక మీ ముక్కు దూలం వంకరగా ఉంది అని అర్దం. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న వైపు, మీ చెంపను కొద్దిగా పక్కకి లాగడం ద్వారా మీ శ్వాసలో మార్పు కనిపిస్తుంది ఇలాగ మీ ముక్కు దూలం వంకరగా ఉంది అని ఇంటివద్దే నిర్దారించుకోవచ్చు. దీనితో మీలో ముక్కుదూలం వంకర ఉంది అని గుర్తించవచ్చు కానీ ఎంత మేర ఉందో గుర్తించలేరు. మీ ENT నిపుణులని సంప్రదించి DNS ఎంత మేరకు ఉందో తెలుసుకుని శాశ్వత పరిష్కారం తీసుకోండి.